దత్తన్నకి క్షమాపణలు చెప్పిన మోడీ
మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పారు. దత్తాత్రేయ పండగలని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకొంటుంటారు. దసరా సమయంలో అలాయ్ బలాయ్ నిర్వహిస్తుంటారు. అన్నీ రాజకీయ పార్టీలకి చెందిన నేతలని ఆహ్వానించి మంచి దావత్ ఇస్తారు. ఇక హోలీ వచ్చిందంటే.. దత్తన్న మీసం, జుట్టు ఎర్రగా మారాల్సిందే. ఆ రంగు పోవడానికి కనీసం రెండు మూడు నెలలు పట్టాల్సిందే. ఐతే, ఈసారి హోలీకి దత్తన్న జుట్టు ఎర్రబడలేదు. ఎందుకు ? అనే డౌటు ప్రధాని మోడీకి వచ్చింది.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో జరిగిన విజయ్ సంకల్ప్ సభ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో దత్తాత్రేయ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతిసారీ హోలీ తర్వాత ‘రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈసారి తెల్లగా ఉందేం?’ అని ప్రశ్నించారు. ‘కొద్దికాలం క్రితం మా అబ్బాయి చనిపోవడంతో ఈసారి హోలీలో పాల్గొనలేదని, అందుకే జుట్టు తెల్లగా ఉందని’ దత్తన్న చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నాకు ఆ విషయ జ్ఞాపకం లేదు క్షమించండి’ అన్నారు.
ఇక, దత్తన్నకి నిజంగానే అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. గత యేడాది ఆయన్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ ఆయనకి సికింద్రాబద్ లోక్ సభ ఎంపీ టికెట్ దక్కలేదు. దీనిపై దత్తన్న మనస్థాపానికి గురైనట్టు వార్తలొచ్చాయ్. ఐతే, బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దత్తన్నని పార్లమెంట్ కి పంపే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారమ్. లేదంటే ? గవర్నర్ ని చేయొచ్చని చెప్పుకొంటున్నారు.