ప్రధాని కేసీఆర్ ! ముఖ్యమంత్రి కేటీఆర్ !!


కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకొనేందుకు రెడీ అవుతున్నారా.. ? అంటే అవుననే అంటున్నారు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉండే అవకాశం ఉందన్నారు. మంగళవారం మంత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి గెలిపించాలని ప్రజలని కోరారు. అదేసమయంలో తెరాస శ్రేణులు ఖుషి అయ్యే ముచ్చట చెప్పారు.

దేశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, భాజపాల పని అయిపోయింది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ముందంజలో ఉన్నాయని, ఆ పార్టీల అభ్యర్థులే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మంది గెలవనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే.. కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నారు మంత్రి మహమూద్ అలీ. ఇటీవల కశ్మీర్‌కు చెందిన ప్రముఖులు తనను కలవడానికి వచ్చిన సందర్భంలో ప్రధానిగా కేసీఆర్‌ అయితే బాగుంటుందని అన్నారని తెలిపారు.

మరోవైపు, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రధాని అవుతారో తెలియదు. కానీ, కేసీఆర్ స్థానంలో కేసీఆర్ ని ముఖ్యమంత్రి కావడం పక్కా అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయం తర్వాత కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేశారని చెబుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసి.. కేసీఆర్ అయితే ప్రధానిగా లేదంటే కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు పిడికిలి బిగించబోతున్నట్టు సమాచారమ్.