పవన్ కోసం రూ. 100కోట్ల బడ్జెట్

హీరోగా పవన్ కళ్యాణ్ రేంజ్ తెలిసిందే. ఆయన కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు.
ప్రస్తుతం పవన్ సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అయినా.. ఆయన కోసం కథలు పట్టుకొని క్యూ నిల్చొని ఉన్న దర్శక-నిర్మాతలు ఉన్నారు. ఏమాత్రం ఛాన్స్ దొరికిన పవన్ తో సినిమా చేయాలన్నది వారి లక్ష్యం. సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ పవన్ కోసం వందకోట్ల బడ్జెట్ ఖర్చు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాక, భీమవరం స్థానాల నుంచి పవన్ బరిలో నిలిచారు. ఐతే, ఈ రెండు చోట్ల పవన్ ని ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు బలంగా ప్రయత్నిస్తున్నాయట. ఇందుకోసం ఏకంగా వందల కోట్ల ఖర్చుపెట్టేందుకు రెడీ అవుతున్నారంట. ఈ విషయాన్ని మంగళవారం విశాఖ ఎన్నికల ప్రచార సభలో పవన్ తెలిపారు.

“వారందరికీ బాధేంటంటే నేను ఎమ్మెల్యే కాకూడదని. ఎమ్మెల్యే అయితే వీడు మా తాట తీస్తాడనే భయంతో నన్ను ఓడించడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఎన్ని వందల కోట్లయినా ఖర్చుచేయండి. నేను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతా. ఇది నా ఛాలెంజ్‌. మార్పు తథ్యం” అని పవన్‌ అన్నారు. దీంతో సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ పవన్ ది భారీ బడ్జెట్ సినిమాయే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.