ఇంత చిల్లర ప్రధానమంత్రిని చూడలేదు : కేసీఆర్
హిందూ, ముస్లింలంటూ పంచాయతీలు పెట్టి ఓట్లు దండుకోవాలని ఎందుకు చూస్తున్నారు ? దేశ ప్రధాని అయి ఉండి హిందూ, ముస్లిం అని మాట్లాడొచ్చా అని ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రధాని మోడీ, బీజేపీ ఎన్నికల హామీలపై తీవ్ర విమర్శలు చేశారు.
గత ఎన్నికలకు ముందు ఏ పాతాళంలో ఉన్నా నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పారు. పేదల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు చొప్పున వేస్తానన్నారు. ఏ మతమైనా, కులమైనా అందరి రక్తం ఒక్కటే. దేశ ప్రధాని అయి ఉండి హిందూ, ముస్లిం అని మాట్లాడొచ్చా ? మోదీ ఏ రాష్ట్రానికి పోతే అక్కడ సీఎంలను వ్యక్తిగతంగా విమర్శించడమేంటి ? ఇంత చిల్లర ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు కేసీఆర్. గత ఎన్నికల్లో నా కోరికను నిలబెట్టారు. ధన్యవాదులు. ఈ ఎన్నికల్లోనూ తెరాసని గెలిపించండని ఆదిలాబాద్ ప్రజలకి విజ్ఝప్తి చేశారు.
దేశం మెచ్చే రెవెన్యూ చట్టం తెస్తాం. ప్రకృతి ఇచ్చిన సంపద ఆదిలాబాద్ సొంతం. తెలంగాణ కశ్మీరం లాంటి ఈ జిల్లాలో అద్భుతమైన పంటలు పండే సారవంతమైన భూములు ఉన్నాయి. వాటన్నింటినీ బాగు చేయాలి. కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఆదిలాబాద్‌ను కశ్మీర్ చేసే బాధ్యత నాది. కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ నుంచి లక్షల ఎకరాలకు త్వరలో సాగునీరు అందిస్తామన్నారు కేసీఆర్.