కేసీఆర్’తోనే ఏపీకి ప్రత్యేక హోదా
ఏపీలో వైకాపా గెలిచినా.. అది కేసీఆర్ వల్లే. ఓడినా కూడా కేసీఆర్ కారణంగానే. ఎందుకంటే ? ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ టార్గెట్ గా నడించింది. జగన్ కేసీఆర్ సామంత రాజు. జగన్ కి ఓటేస్తే కేసీఆర్ కి ఓటేసినట్టే. జగన్ గెలిస్తే ఏపీని తీసుకెళ్లి కేసీఆర్ చేతుల్లో పెడతాడు. అప్పుడు పోలవరం నిర్మాణం ఆగిపోద్ది. ఏపీకి ప్రత్యేక హోదా రాదు.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మైకులు పగిలేలా అరిచారు. దానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో దోస్తానా ఏపీలో జగన్ కి మైనస్ అయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయినా.. జగన్ అదరలేదు. బెదరలేదు. కేసీఆర్ తో సాన్నిహిత్యం ఏపీకి లాభిస్తుందని జగన్ చెబుతూ వస్తున్నారు. ప్రచారానికి ఆఖరి రోజైన మంగళవారం కూడా జగన్ కేసీఆర్ తో కలిస్తేనే ఏపీ ప్రత్యేక హోదా తీసుకురావడం మరింత ఈజీ అవుతుందని చెప్పడం విశేషం.
మనం 25 ఎంపీ సీట్లు గెలిచి.. తెలంగాణలో కేసీఆర్ 17 సీట్లు గెలిస్తేనే కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలం. కేసీఆర్తో జత కట్టి, ఆయన సాయం తీసుకుంటే రాష్ట్రానికి కచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకురాగలమనే నమ్మకం నాకుందన్నారు జగన్. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ గెలిస్తే.. అందులో కేసీఆర్ కి క్రెడిట్ దక్కుతుంది. ఓడినా కూడా అందుకు కేసీఆర్ నే కారణం. మరీ.. జగన్ ని కేసీఆర్ గెలిపించబోతున్నాడా ? ఓడించబోతున్నాడా.. ?? అనేది చూడాలి.