వీరు ఓటేశారు.. మీరు ఓటు వేయండి !
దేశంలో ఓట్ల పండగ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల పర్వం తొలి దశలో దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25లోక్ సభ స్థానాలకి గానూ, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకి గానూ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కుని వినియోగించుకొంటున్నారు.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. మేం ఓటేశాం.. మీరు కూడా తప్పక ఓటు వేయండిని పిలుపునిస్తున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.33లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో ఓటు వేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారా లోకేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి ఓటు వేశారు. సినీ నటి అమల గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తెదేపా అభ్యర్థి కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుణదల సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు.