ఆ.. పనిలో పడ్డ కేసీఆర్.. !
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్పిన చట్టం కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తం. దేశం గర్వించదగ్గ రెవెన్యూ చట్టాని రూపకల్పన చేయబోతున్నాం. తద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడా పనిలో పడ్డారు సీఎం కేసీఆర్. శుక్రవారం కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అవినీతికి ఆస్కారం లేని విధంగా కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టం రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ అర్బన్ పాలసీపై చర్చించారు. ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావాల్సిన పనులు జరగాలి. అందుకోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలన్నారు సీఎం కేసీఆర్. సమీక్ష సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేటీఆర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.