కేటీఆర్ లోకల్ ఫైట్ షురు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాన్ స్టాప్ గా ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు కేటీఆర్. దానికి ఫలితం దక్కింది. తెరాస మరోసారి ఘన విజయం సాధించింది. పార్టీలో కేటీఆర్ బాధ్యత పెరిగింది. ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది.

తెరాస వర్కింగ్ ప్రెసిడెంటు హోదాలో కేటీఆర్ పంచాయతీ ఎన్నికలని ఎదుర్కొన్నారు. మంచి విజయాలని సాధించారు. ఐతే, అవి పార్టీ సింబర్ తో జరిగిన కావు. దీంతో అసలైన కిక్కు లభించలేదు. లోక్ సభలో ఎన్నికల్లో ‘సారు కారు పదహారు’ స్లోగన్ తో ప్రచారాన్ని హోరెత్తించారు. ఆ ఫలితాలు రాకముందే మళ్లీ స్థానక సమరం సైరన్ మ్రోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో కేటీఆర్ మరోసారి ఫైట్ మొదలెట్టాడు.

శనివారం తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. లోక్‌సభ పోలింగ్‌ సరళితో పాటు త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సమీక్షించారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్తుల్లో తెరాస విజయకేతనం ఎగురవేస్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే 530కి పైగా మండల పరిషత్తుల్లోనూ గెలుస్తామన్నారు. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని సూచించారు.