రాష్ట్ర భవిష్యత్ ఓ స్వామిజీ చేతిలో.. నిజమే !
‘రాష్ట్ర భవిష్యత్ ఓ స్వామిజీ చేతిలోనా.. ‘ ‘నోటా’ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఆశ్చర్యపోతూ.. చెప్పిన డైలాగ్ ఇది. ఇదే డైలాగ్ ఇటీవల తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వినిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్యోతిష్యాల పిచ్చి. ఆయన కేవలం ముహూర్తపు బలం కోసం ముందుస్తుకు వెళ్లారు. కేభినేట్ విస్తరణ విషయంలోనూ అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. రాష్ట్ర భవిష్యత్ ఓ స్వామిజీ చేతిలో ఉందన్నారు. పరోక్షంగా చినజీయర్ స్వామిజీ ఏమి చెబితే కేసీఆర్ అదే చేస్తారు అన్నట్టుగా విమర్శించారు.
ఇప్పుడది నిజమే అన్నట్టు తెలంగాణ రెవెన్యూ అధికారులు వెళ్లి చినజీయర్ స్వామిని కలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అసలు రెవెన్యూ శాఖను రద్దు ఆలోచన కూడా చేస్తున్నట్టు సంకేతాలిచ్చారు. అదే సమయంలో దేశం గర్వించదగ్గ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కలెక్టర్ ల పేర్ల మార్పు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులకి భయం పట్టుకొంది. తమకు సీఎం సీఎంని కలిసే అవకాశం రావడం లేదని.. వెళ్లి చినజీయర్ స్వామిజీని కలిసి హడావుడి చేశారు. రెవెన్యూ శాఖను రద్దు చేయవద్దని కోరామని, తాను ఆశీర్వాదం ఇస్తే ఎలాంటి ఇబ్బందులూ రావని చినజీయర్ స్వామి చెప్పారన్నారు వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్ తెలిపారు. వీరి తీరు చూస్తుంటే.. నిజంగా తెలంగాణ ప్రభుత్వం స్వామిజీ చేతిలో ఉందనే భ్రమ కలుగుతోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ చేసిన విమర్శలు నిజమనిపించక మానదు.
అన్నట్టు… చినజీయర్ స్వామిజీని తెలంగాణ సీఎం ఒక్కరే కలవలేదు. ప్రధాని మోడీ కూడా స్వామిజీని కలిసి ఆశీర్వాదం తీసుకొన్నారు. హిందుత్వం పై రాజకీయం చేసే అలవాటున్న బీజేపీ.. తెలంగాణ విషయంలోనూ ఆ దిశగా ప్రయత్నించింది. అది ఏ మేరకు ఫలించిందన్నది లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అన్నదానిపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.