చంద్రబాబుకు కేటీఆర్ సూటి ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవీఎంల పని తీరును ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11న ఎన్నికల ముగియగానే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. సీఈసీతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించిన తీరుపై మండిపడ్డారు. 50 వీవీ ప్యాడ్ లని లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు డిమాండ్ కు జాతీయ నేతల మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు, ఈసారి ఏపీలో చంద్రబాబు ఓడటం ఖాయం. అందుకే ఆ ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
2014 ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు.. నేడు మాత్రం వాటిని ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంల పని తీరును ప్రశ్నిస్తున్నారని, ఆయన ప్రవర్తనలో ఓటమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆదివారం కేటీఆర్ తెరాస భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో స్థానిక పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు.