చిన్మయికి రజనీ దర్శకుడి మద్దతు

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కెరీర్‌ను నాశనం చేస్తానని నిర్మాత కే రాజన్‌ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడటం సంచలనంగా మారింది. సోమవారం చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి నిర్మాత కే రాజన్‌ హాజరయ్యారు. తన గురువు వైరముత్తుపై చిన్మయి చీప్‌ పబ్లిసిటీ కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రాజన్‌ ధ్వజమెత్తారు. ఆమె కెరీర్‌ నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

ఇదే కార్యక్రమానికి హాజరైన దర్శకుడు పా రంజిత్ కే రాజన్ కి చురకలంటించారు. మహిళా ఆర్టిస్ట్‌ల పట్ల జరుగుతున్న అక్రమాలను ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ గుర్తించి నిందితులకు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు. అంతేకానీ బయటపెట్టినందుకు వారిని బెదిరించకూడదని రాజన్‌ను పరోక్షంగా హెచ్చరించారు.

సింగర్ చిన్మయి దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రముఖ రచయిత వైరముత్తు లైంగిక వేధించినట్టు ఆరోపించింది. డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ ప్రసిడెంట్ రాధారవిపై కూడా ఇలాంటి ఆరోపణలో చేసింది. అదే సమయంలో ఆమెకు కౌంటర్ గా విమర్శలు, ఆరోపణలు, బెదిరింపులు వచ్చాయి. ఆమెను తమిళనాడు డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగించారు. దాంతో ఆమె కేంద్రమంత్రి మేనకా గాంధీ సాయం కోరారు. ఈ కేసును పరిశీలించి త్వరలో న్యాయం జరిగేలా చూస్తానని మేనక హామీ ఇచ్చారు.