‘వీర్‌ చక్ర’కు అభినందన్‌ పేరు

పాక్‌ యుద్ధ విమానాన్ని కూల్చివేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పేరును భారత వాయుసేన ‘వీర్‌ చక్ర’ అవార్డుకు ప్రతిపాదించింది. అభినందన్ పేరుతో పాటు పాకిస్థాన్‌లోని లక్ష్యాల మీద బాంబులు విడిచిన 12 మిరాజ్‌ 2000 పైలట్ల పేర్లను వాయుసేన మెడల్ ఫర్ గ్యాలంట్రీకి ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. పరమ వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర తరవాత యుద్ధ సమయాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే మూడో అత్యున్నత పురస్కారమే వీర్ చక్ర.

మరోవైపు, అభినందన్‌ పోస్టింగ్ ఆర్డర్‌ జారీ అయింది. ఆయన త్వరలో మరో కొత్త ఎయిర్‌బేస్‌లో బాధ్యతలు చేపడతారు. భద్రత దృష్ట్యా శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌కు ఆవల ఉన్న ప్రాంతానికి అధికారులు అభినందన్ ని బదిలీ చేశారు. ఆయన తిరిగి డ్యూటీలో చేరేందుకు మే చివరి వరకు గడువు ఉంది.

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే ఉగ్రశిబిరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 27న భారత్‌పై పాక్‌ దాడికి యత్నించడంతో.. ఇరు దేశాల మధ్య వైమానిక పోరు జరిగింది. పాక్‌కు చెందిన ఎఫ్ 16ను కూల్చిన అనంతరం అభినందన్‌ ప్రయాణిస్తున్న మిగ్‌ 21 విమానం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోవడంతో ఆయన అక్కడ పాక్‌ సైనికులకు దొరికిపోయారు. భారత్‌ ఒత్తిడి మేరకు తిరిగి ఆయన్ను మాతృదేశానికి అప్పగించారు.