ఫెయిల్ అయితే ఓడినట్టు కాదు


తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు. ఇందుకు ఇంటర్ బోర్డ్ చేసిన తప్పిదాలే కారణమనే విమర్శలొస్తున్నాయి. ప్రథమ సంవత్సరంలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయ్యారు. టాప్ ర్యాంకర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. అంతేకాదు.. కొందరికి మార్కులకి బదులుగా రకరకాల సింబల్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విద్యార్థులు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొంటున్నారు. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. “కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదు. ప్రాణాలు పోతే తిరిగిరావు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. పసిపిల్లలను ఒత్తిడికి గురిచేసే చర్యలకు పాల్పడవద్దని తల్లిదండ్రుల్ని, టీచర్లను కోరుతున్నా. మన కనుపాపలైన బిడ్డల్ని కాపాడుకుందాం” అని హరీష్ ట్విట్ చేశారు.