ఆ డబ్బులు ఎవరిస్తారు.. కేటీఆర్ సారు ?
ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం సమీక్షించారు. ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోండిని కేటీఆర్ సూచించారు.
ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై కాస్త లేటుగానైనా.. ప్రభుత్వం స్పందించిన తీరుని మెచ్చుకోవాల్సిందే. ఐతే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్ట్ కు రూ. 1800 నుంచి 2000వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం పేద విద్యార్థులకి భారం కానుంది. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ల దరాఖాస్తు కోసం రుసుము భారీగా తగ్గించడమా.. ! లేదంటే ఉచితంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించాలనే విజ్ఝప్తులు వస్తున్నారు.
ఇక, మంచిర్యాల జిల్లా జన్నారంలోని కరిమల జూనియర్ కళాశాల విద్యార్థిని నవ్య(సీఈసీ) రీ వెరిఫికేషన్ లో పాసైంది. నవ్య ఫస్ట్ ఇయర్ లో 467 మార్కులతో కాలేజ్ టాపర్. ఐతే, సెకండ్ ఇయర్ లో ఆమెకు తెలుగులో 0 మార్కులొచ్చాయి. రీవెరిఫికేషన్ లో ఆమెకు 99 మార్కులు రావడం విశేషం. ఈ లెక్కన ఇంటర్ ఫలితాల్లో తప్పుల తడకలు నిజమేననే కామెంట్స్ వినబడుతున్నాయి.