ఆ రెండే.. తెదేపాని గెలిపించబోతున్నాయ్ !

సంక్షేమ పథకాలే తెదేపాని గెలిపించబోతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. మరీ.. ముఖ్యంగా పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లే తెదేపా గెలిపిస్తాయి. అవి లేకుంటే మా మా గతి అథోగతయ్యేదని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.
అమరావతిలో సోమవారం జేసీ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఏపీలో 120 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వీటిలో పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్లే ప్రేక్షకులని బాగా ఆకట్టుకొన్నాయి. అవే మరోసారి తెదేపాని గెలిపిస్తాయని అన్నారు.

ఎన్నికల ఖర్చుపై జేసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాయని జేసీ అన్నారు. ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చుపెట్టారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల మొత్తం ఖర్చు రూ.50 కోట్లు దాటిందన్నారు. ఎన్నికల ఖర్చ తగ్గించేందుకు త్వరలో ఓ వేదిక ఏర్పాటు చేయనున్నట్టు జేసీ తెలిపారు. జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జయప్రకాశ్‌ నారాయణ లాంటి మేధావులతో కలిసి ఈ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.