ఇంటర్ ఫలితాల విషయంలో ఆందోళన వద్దు : కేటీఆర్

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు జరిగినట్టు ఆరోపణలొస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుండటంతో.. ఈ వ్యవహారం సీరియస్ గా మారింది. తాజాగా, ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చెందవద్దు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఏ ఒక్క విద్యార్ధికి కూడా నష్టం జరగకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది”

“ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో చోటుచేసుకున్న అపోహలపై విద్యాశాఖా మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నేడు సమీక్షించారు. ఈ అపోహలను తొలగించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సత్వరమే దర్యాప్తు జరిపి మూడు రోజులలో ఈ కమిటీ నివేదికను సమర్పిస్తుంది” అంటూ వరుస ట్విట్ చేశారు కేటీఆర్.