ఈసీ హెచ్చరించినా.. చంద్రబాబు మళ్లీ సమీక్ష !


సమీక్ష, సమావేశాలు నిర్వహించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఈసీ మందలించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొంది. దీంతో.. సీఎం చంద్రబాబు వరుస సమీక్ష సమావేశాలకి బ్రేక్ పడింది. తాజాగా, సీఎం చంద్రబాబు మళ్లీ సమీక్షలు మొదలెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఐతే, ఈ సమీక్షలు అధికారులతో కాదు. పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.

శాసనసభ, లోక్‌సభ అభ్యర్ధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇందులో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ గెలుపు అవకాశాలపై చర్చించనున్నారు. పోలింగ్‌కు సంబంధించి బూత్‌ల వారీగా చర్చించనున్నారు. మరికొద్దిసేపట్లో
ఉండవల్లిలో ఈ సమీక్ష సమావేశం మొదలు కానుంది. ఓట్ల లెక్కింపు జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేయనున్నారు. పని లేకుండా చంద్రబాబు ఖాళీ కూర్చోలేరు. అందుకే ఆయన పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.