కోర్టులో ప్రభాస్’కు ఊరట

హీరో ప్రభాస్ ఫాంహౌస్ వివాదంపై కోర్టు తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని రాయ్ దుర్గ వన్మక్త గ్రామంలో ప్రభాస్ కు సంబంధించిన భూమిపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. ప్రభాస్ ఫాంహౌస్ కు తాళలు వేసింది. దీనిపై ప్రభాస్ న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టు పిటిషన్ దాఖలు చేశాడు. భూమి కొనుగోలుకు సంబంధించిన డాకుమెంట్స్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఆ భూమి తమదే అంటూ స్వాధీనం చేసుకుందని ప్రభాస్ పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా, ఈ పిటిషన్ ని విచారించిన హైకోర్టు తీర్పుని వెల్లడించింది.

1958 నుంచి ఈ భూముల వివాదం నడుస్తోంది. ఆ భూములని తిరిగి స్వాధీనం చేయలేమని, అలాగని ప్రభాస్‌కి అప్పగించలేమని న్యాయస్థానం పేర్కొంది. ప్రభాస్ పెట్టుకున్న క్రమబద్దీకరణ దరఖాస్తుపై ఎనిమిది వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. వీటిని తిరస్కరిస్తే.. తగిన ఆదేశాల నిమిత్తం ప్రభాస్ తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చునని కోర్టు తెలిపింది. తాజా తీర్పుతో కొంతలో కొంత ప్రభాస్ కు ఊరట లభించినట్టయింది.

ఇక, సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో శ్రద్దాకపూర్ కథానయిక. ఈ యేడాది ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహోతో పాటు రాథాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇదో ప్రేమకథా చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా కూడా ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకు రానుంది.