పది ఫలితాల్లోనూ అక్రమాలు ?

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు విద్యార్థుల నిండు ప్రాణాలని బలిగొంటున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 17మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు. దీంతో ఇంటర్ బోర్డ్ వ్యవహారం సీరియస్ గా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ నష్ట నివారణ చర్యలని చేపట్టింది. ఇందులో భాగంగా ఫెయిల్ అయిన విద్యార్థుల పేపర్లని పున:పరిశీలిస్తామని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ మాత్రమే కాదు పదో తరగతి ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులొస్తున్నాయ్.

పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని టీయూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు బుధవారం ఆర్జేడీ రాజీవ్‌కు వినతిపత్రం అందించారు. రోజుకు ఒక ఏఈ ఉదయం 20, మధ్యాహ్నం 20 మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉండగా రోజుకు 60 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నారన్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంలో ఎదురైన చేధు అనుభవం దృష్ట్యా.. పదో తరగతి ఫలితాల్లో తప్పులు దొర్లకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొంతే మంచిదేమో.