బెంగళూరు హ్యాట్రిక్ విక్టరీ
వరుస ఓటములతో వాచిపోయిన కోహ్లీ మొహంలో మళ్లీ కలొచ్చింది. కోహ్లీ సారధ్యంలోని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ట్రాక్ లోకి వచ్చేసింది. హ్యాట్రిక్ విజయాలని ఖాతాలో వేసుకొంది. గురువారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 17 పరుగులతో తేడాతో విజయం సాధించింది. ఏబీ డివిలియర్స్ (82 నాటౌట్; 44 బంతుల్లో 3×4, 7×6), పార్థివ్ పటేల్ (43; 24 బంతుల్లో 7×4, 2×6), స్టాయినిస్ (46 నాటౌట్; 34 బంతుల్లో 2×4, 3×6) మెరవడంతో మొదట బెంగళూరు 4 వికెట్లకు 202 పరుగులు చేసింది.
203లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 7 వికెట్లకు 185 పరుగులు చేయగలిగింది. కేఎల్ రాహుల్ (42; 27 బంతుల్లో 7×4, 1×6), మయాంక్ అగర్వాల్ (35; 21 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు.. పూరన్ (46; 28 బంతుల్లో 1×4, 5×6) పోరాటం సరిపోలేదు. చివరి రెండు ఓవర్లలో పంజాబ్ కు 30 పరుగులు అవసరమయ్యాయి. కానీ సైని 19 ఓవర్ తొలి బంతికి మిల్లర్‌ను, ఆఖరి బంతికి ప్రమాదకర పూరన్‌ను ఔట్ చేసి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాత బెంగళూరు గెలుపు లాంఛనమే అయింది.
గత ఐదు మ్యాచ్ లలో బెంగళూరుకిది నాలుగో విజయం. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలిచి తీరాలి. తన తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది.