చరిత్ర : పురుషుల వన్డే మ్యాచ్’కు మహిళా అంపైర్‌

పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తొలిసారి ఓ మహిళ అంపైర్‌గా వ్యవహరించింది. వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌2లో భాగంగా ఒమన్‌, నమీబియా మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిరే పొలొసాక్‌ అంపైర్‌గా వ్యవహరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆమె గతంలో ఎప్పుడూ క్రికెట్‌ ఆడనప్పటికీ మహిళల క్రికెట్‌లో 15 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేసింది.

2018 ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఒకసారి, 2017 మహిళా ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచులకు అంపైరింగ్‌ చేసిన అనుభవం ఉంది. అలాగే న్యూసౌత్‌వేల్స్‌ – క్రికెట్‌ ఆస్ట్రేలియా XI మధ్య సిడ్నీలో జరిగిన పురుషుల వన్డే మ్యాచ్‌కి సైతం అంపైర్‌గా వ్యవహరించింది. పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తొలి మహిళా అంపైర్‌గా వ్యవహరించడం తనకెంతో సంతోషంగా ఉందని, మహిళా అంపైర్లకి అవకాశాలిచ్చి వారిని వెలుగులోకి తీసుకురావాలని కోరింది.