ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేదు : వర్మ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మే1న ఏపీలో విడుదలకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం విజయవాడ
లోని ఓ హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టాలని భావించారు. ఐతే, ఏ హోటల్ కూడా అందుకు అనుమతిని ఇవ్వలేదు. దీని వెనక టీడీపీ నేతల బెదిరింపులు ఉన్నాయన్నది వర్మ వాదన. నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని ట్విట్ చేసి హీట్ పెంచాడు వర్మ. ఏపీ పోలీసులు మాత్రం వర్మ ఆటలు సాగనివ్వలేదు. ఆయన ఏపీలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేశారు. తిరిగి విమానం ఎక్కించి హైదరాబాద్ పంపించేశారు. దీనిపై వర్మ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనకి జరిగిన అన్యాయంపై ఓ వీడియో విడుదల చేశారు.

“విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వెళుతుంటే పోలీసులు మా వాహనాలను ఆపేశారు. బలవంతంగా వేరే కారులో ఎక్కించేశారు. ఇక్కడ ఎలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. విజయవాడ రావడానికి వీల్లేదు, విజయవాడలో ఎక్కడా ఉండటానికి వీల్లేదు అని తీసుకొచ్చి మళ్లీ ఎయిర్‌పోర్టులో పడేశారు.”

“నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను. నేను చేసిన ఒకే ఒక నేరం నిజం చెప్పడమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు. పోలీసులు ఎందకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. మేము విజయవాడ ఎందుకు రాకూడదు, ఇక్కడ ఏ హోటల్‌లో ఎందుకు ఉండకూడదు? అని అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదు” అంటూ వరుస ట్విట్స్ చేశాడు వర్మ. అంతేకాదు. ఏపీ ప్రభుత్వం, పోలీసులకి ఓ 15ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.