ఐపీఎల్-12 నుంచి బెంగళూరు ఔట్
ఐపీఎల్ సీజన్-12లో కోహ్లి జట్టు కథ ముగిసింది. మంగళవారం రాజస్థాన్ తో మ్యాచ్ వర్షం కారణంగా ఐదు ఓవర్ల పోరుగా మారింది. చివరకి అది కూడా పూర్తి కాలేదు. ఇంకో పది బంతులుండగా మరోసారి వరుణుడు ఆటకు బ్రేక్ వేశాడు. దీంతో మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో బెంగళూరు పాయింట్లు 9కి చేరాయి. దీంతో ఆజట్టు ప్లేఆఫ్ అవకాశాలకు తెరపడింది. 11 పాయింట్లతో రాయల్స్ ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది.
5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. కోహ్లి, డివిలియర్స్ ఓపెనర్లుగా దిగారు. తొలి ఓవర్ లో మొత్తంగా 23 పరుగులొచ్చాయి. రెండో ఓవర్లో శ్రేయస్ గోపాల్ (3/12) సంచలన హ్యాట్రిక్‌తో కథ మార్చేశాడు. తొలి 9 బంతులకు వికెట్ కోల్పోకుండా 35 పరుగులు చేసిన బెంగళూరు.. తర్వాతి 21 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 27 పరుగులే చేసింది. అనంతరం రాయల్స్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన స్థితిలో మళ్లీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో ఆట రద్దయింది. మ్యాచ్ రద్దుతో బెంగళూరుకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి.