నంద్యాల ఎంపీ ఎస్‌.పి.వై.రెడ్డి ఇకలేరు

నంద్యాల ఎంపీ ఎస్‌.పి.వై.రెడ్డి (69) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు.
నందిపైపుల అధినేతగా ఆయన ముద్ర వేసుకున్నారు. ఎస్పీవైరెడ్డి మూడు దఫాలుగా లోక్‌సభ సభ్యునిగా విశేష సేవలందించారు.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జనసేన తరపున నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ పడ్డారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వెంట కర్నూలు జిల్లా నందికొట్కూరు, నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎండల తీవ్రతవల్ల వడదెబ్బకు గురైన ఆయనను పెద్ద కుమార్తె సుజల ఏప్రిల్‌ 4వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేర్‌ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు. ఎస్పీవైరెడ్డి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.