మహేష్‌360° నటుడు

సూపర్ స్టార్ మహేష్ బాబు 360°నటుడు. 360 డిగ్రీలలో ఎటు కెమెరా పెట్టినా అందంగానే ఉంటాడు మహేష్ అన్నారు విక్టరీ వెంకటేష్. ఆదివారం జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ వేడుకకి వెంకీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. ” ‘మహర్షి’ ట్రైలర్‌లో చెప్పినట్టు మహేష్‌ కూడా ప్రపంచాన్ని ఏలేస్తాడు. ట్రైలర్‌ అదిరిపోయింది. చిన్నోడు పూలకుండీ తన్నినప్పుడు ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా అన్ని రికార్డులూ బద్దలు కొట్టేయాలి” అన్నారు.

మహేష్‌బాబు మాట్లాడుతూ “వెంకటేష్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. నవతరం కథానాయకుల్లో విజయ్‌ అంటే ఇష్టం. ‘అర్జున్‌ రెడ్డి’ బాగా నచ్చింది. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో కొన్ని సినిమాల్ని, కొంతమంది దర్శకుల్ని గుర్తు చేసుకోవాలి. నన్ను పరిచయం చేసింది దర్శకుడు రాఘవేంద్రరావుగారు. ఆయనకెప్పుడూ రుణపడి ఉంటా. నేను నటించగలను అని నిరూపించిన సినిమా ‘మురారి’. అలాంటి సినిమాని అందించిన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు. నన్ను స్టార్‌ చేసిన సినిమా ‘ఒక్కడు’. నన్ను కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమా ‘అతడు’. నా జీవితంలో గొప్ప మలుపు ‘దూకుడు’. రెండు సార్లు తన సినిమాలతో నాకు జీవితాన్ని ఇచ్చారు కొరటాల శివ. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. వంశీ నా సోదర సమానుడు” అన్నారు.