‘సైరా’ సెట్స్’లో అగ్నిప్రమాదం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా’. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా సెట్ లో ఈ తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో చిరంజీవి ఫాంహౌజ్‌లో సైరా కోసం భారీ సెట్ వేశారు. గత కొద్దిరోజులుగా ఇక్కడ కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకు షూటింగ్ కొనసాగింది. ఐతే, తెల్లవారు జామున సెట్స్ లో మంటలు చెలరేగి.. సెట్ అంతా కాలిపోయింది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

సైరా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్‌తో పాటు ‘సైరా’కు సంబంధించిన సెట్ కూడా కాలిపోయింది. సైరా కోసం శేరిలింగంపల్లిలో వేసిన సెట్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చి వేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారనే కారణంతో కూల్చేశారు. తాజా అగ్నిప్రమాదంలో సైరా సెట్ మొత్తం కాలిపోయింది. దీంతో భారీ నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది.

తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. చిరుకి జంటగా నయనతార నటిస్తున్నారు. కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘సైరా’ వరుసగా షూటింగ్ లకి అంతరాయం కారణంగా.. వచ్చే యేడాది సంక్రాంత్రికి వెళ్లేలా కనిపిస్తోంది.