అనుమతి లేకుండానే ‘మహర్షి’ టికెట్ ధరలు పెంపు.. !
ఈ వారం (మే9) ప్రేక్షకుల ముందుకురాబోతున్న ‘మహర్షి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దాన్ని క్యాష్ చేసుకొని రికార్డు స్థాయిలో తొలిరోజు కలెక్షన్స్ తండుకోవడానికి చిత్రబృందం రెడీ అయింది. ఇందుకోసం ‘మహర్షి’ సినిమా టికెట్ ధరలను పెంచారు
హైదరాబాద్‌లోని పలు థియేటర్ల యాజమాన్యాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ ధరను రూ.110కి పెంచారు.
మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 ఉన్న టికెట్ ధరను రూ.200కి పెంచారు. ప్రభుత్వం అనుమతితోనే ధరలు పెంచినట్లు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. 2వారాలపాటు ఈ ధరలు అమలులో ఉంటాయని తెలిపారు.
మరోవైపు, మహర్షి సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టంచేయడం గమనార్హం. దీంతో ప్రభుత్వ అనుమతిలేనిదే థియేటర్ యాజమాన్యాలు మహర్షి టికెట్ ధరలని ఇష్టారాజ్యంగా పెంచుకోవడమేంటనీ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
మహర్షి సినిమా ఐదు షోలకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీంతో మే 9 నుంచి మే 22 వరకు ఐదు షోలను ప్రదర్శించబోతున్నారు. దీంతో.. మహర్షి తొలివారం కలెక్షన్స్ అదిరిపోనున్నాయి. నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.