నరేష్ ని సీరియస్ గా తీసుకోవాల్సిందే.. !


అల్లరి నరేష్ పై కామెడీ హీరో అనే ముద్రపడిపోయింది. అల్లరోడి కితకితలు పెడితే భలేగుంటుంది. హాయిగా నవ్వుకోవచ్చని ప్రేక్షకులు ఫిక్సయ్యారు. నరేష్ కూడా అదే పంథాలో వెళ్లి జెడ్ స్వీడుతో సినిమాలు చేశారు. ప్రేక్షకులని నవ్వించారు. 50 సినిమాలు పూర్తి చేశాడు. ఐతే, మధ్య మధ్యలో అల్లరోడు సీరియస్ కనిపించిన సందర్భాలున్నాయి. ‘గమ్యం’ సినిమాలో గాలిశీను పాత్రని మర్చిపోలేము. ‘శంభో శివ శంభో’లో మల్లిగాడుని మరచిపోలేం. అయినా.. నరేష్ ని సీరియస్ చూపించేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. మంచి పాత్ర పడితే నరేష్ ఏం చేయగలడో మహర్షి సినిమా మరోసారి నిరూపించింది.

గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మహర్షి సినిమాలో అల్లరోడి పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు.
ఇందులో నరేష్ కథని మలుపుతిప్పే పాత్రలో నటించారు. కాలేజ్ ఎపిసోడ్ లో మంచి స్నేహితులు అంటే ఇలా ఉండాలి అని అనుకునేలా మహేష్ – నరేష్ నటన ఉంది. సెకండ్ హాఫ్ లో అయితే నరేష్ ను ఎంత పొగిడినా తక్కువే. దాదాపు ఇంటర్వెల్ తరువాత భాగం మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు తనదైన శైలి లో అమాయకత్వం, సందర్భానుసారంగా అవలీలగా హావాభావాలు పలికించారు నరేష్. మహర్షి సినిమాతోనైనా.. దర్శకులు నరేష్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఆయన కోసం మంచి పాత్రలు రాయాలని ఆయన అభిమానులు కోరుకొంటున్నారు.