రవిప్రకాశ్ లైవ్ లోకి వచ్చాడు.. క్లారిటీ ఇవ్వలేదు !


టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయనున్నారనే ప్రచారం గురువారం ఉదయం నుంచి జరుగుతోంది. కొత్త యాజమాన్యానికి వ్యతిరేకంగా రవి ప్రకాష్ వ్యవహరిస్తున్నాడని అలంద సంస్థ ఆరోపణలు చేసింది. అంతేకాదు రవి ప్రకాష్ ఫోర్జరీ చేశాడని కూడ ఆ సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో రవిప్రకాష్ అరెస్ట్ వార్తలని టీవీ ఛానెల్స్ హెడ్ లైన్స్ లో ప్రసారం చేశాయి. రవి ప్రకాష్ గత చరిత్రని తవ్వే ప్రయత్నం చేశాయి. ఐతే, సాయంత్రానికి రవిప్రకాష్ టీవీ9లైవ్ లోకి వచ్చాడు. తనపై వార్తలు ప్రచారం చేస్తున్న టీవీ ఛానెల్స్ కి క్లాస్ పీకరు. అసలైన జర్నలిజం అంటూ.. మాటలు చెప్పాడు. ఎన్‌సీఎల్టీ కేసు 16వ తేదీ విచారణకు రానుందని.. దానిని అడ్డం పెట్టుకుని కొందరు తనపై తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారని.. అయితే అలాంటి తప్పుడు కేసులు నిలబడవని, సత్యానిదే అంతిమ విజయమన్నారు. ఐతే, ఈ కేసు తాలుకు వివరాలని మాత్రం వివరించే ప్రయత్నం చేయలేదు.

శుక్రవారం రవిప్రకాష్ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు రవి ప్రకాష్ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఇదే కేసుకు సంబంధించి నటుడు శివాజీ ఇంట్లో కూడ పోలీసులు సోదాలు నిర్వహించారు. శివాజీకి కూడ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం నాడు పోలీసుల విచారణకు రవి ప్రకాష్, శివాజీ హాజరౌతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.