ఇంటర్ వ్యవహారం.. అఖిలపక్షం లక్ష్యం అదే !

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఈ సందర్భంగా పలువురు నేతలు విమర్శించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సాధించడమే తమ లక్ష్యమన్నారు. మూడు రోజుల్లో స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అంతేకాదు.. ఈ వ్యహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలవనున్నట్టు తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

ఫలితాల్లో అవకతవకలకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రిని బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలలు దిద్దాల్సిన పేపర్లను నెలలోనే పూర్తిచేశారని ఆయన ఆరోపించారు. ఇంటర్‌ ఫలితాల డేటాను తప్పుల తడకగా పొందుపరిచారని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. ఇక, అఖిలపక్షం ధర్నాలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, నగేశ్ లు తన్నుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కుర్చీ కోసం వీరిద్దరు తన్నుకొన్నారు.