ప్రధానిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ?


కేంద్రంలో మరోసారి భాజాపా ప్రభుత్వం వచ్చే అవకాశాల్లేవని ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి. ఒకవేళ మళ్లీ భాజాపా అధికారంలోకి వచ్చినా.. నరేంద్ర మోడీని తప్పిస్తారు. ఆయన స్థానంలో రాజ్ నాథ్ సింగ్ లేదంటే గడ్కరికి అవకాశం దక్కవచ్చనే సమాచారం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. మంగళవారం ఏపీ కేబినేట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీపై వస్తోన్న వ్యంగ్యాస్త్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది. మోదీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అంశాలను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సీఎంకు వివరించారు. ఎన్డీయేకు ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుపు అవకాశాలు కన్పించడంలేదని చంద్రబాబు అన్నారు. ఒకవేళ వచ్చినా మోదీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోందని ఓ మంత్రి సీఎం వద్ద అన్నట్టు తెలుస్తోంది. రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కరీకి అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని మరో మంత్రి అన్నట్టు సమాచారం. ఇక, ఏపీలో తెదేపాపై అనుమానమే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు.