భువి వరల్డ్ కప్ హెచ్చరికలు
ఐపీఎల్-12 హంగమా ముగిసింది. మరో రెండు వారాల్లో ప్రపంచకప్ సమరం ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. ఐతే, భారత బౌలర్ల ఫామ్ వేధిస్తోంది. బుమ్రా, భువనేశ్వర్ బౌలింగ్ పై ఎలాంటి అనుమానాల్లేవ్. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కుల్దీప్ యాదవ్ ఫామ్ కోల్పోయాడు. షమీ కూడా మునుపటిలా ఆకట్టుకోలేదు. ఇప్పుడిదే టీమిండియా అభిమానులని కలవరపెడుతోంది. ఐతే, భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు భువనేశ్వర్ కుమార్.
అంతేకాదు.. ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్లన్నీ టీమిండియా బౌలింగ్ యూనిట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని భువి హెచ్చరికలు జారీ చేశాడు. ఇంగ్లాండ్‌లో కొన్నాళ్లుగా పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంది. రోజు రోజుకూ జట్టు బౌలింగ్ దృఢమవుతోంది. ఎలాంటి పిచ్ మీదయినా ఇండియన్ పేసర్లు రాణించగలరు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌ల బౌలింగ్ తీరు ఎలాంటిదో అన్ని జట్లకూ ఇప్పటికే అవగాహన ఏర్పడి ఉంటుంది. నేను కూడా నా సామర్థ్యం మేరకు ప్రపంచ కప్‌లో రాణిస్తానని నమ్ముతున్నాను’ అన్నాడు భువి.