రివ్యూ : ఏబీసీడీ
చిత్రం : ఏబీసీడీ (2019)
నటీనటులు : అల్లు శిరీష్, రుక్సర్ థిల్లాన్, భరత్, నాగబాబు తదితరులు
సంగీతం : జుదా సాందీ
దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
రిలీజ్ డేటు : 17మే, 2019.
రేటింగ్ : 2/5
టాలీవుడ్ లో టాప్ బ్రాండ్ మెగా బ్రాండ్. ఆ బ్రాండ్ తో వచ్చిన ప్రతి హీరో సక్సెస్ అయ్యారు. ఇన్నామొన్న వచ్చిన వరుణ్ తేజ్, సాయిధరమ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే, వీరికంటే ముందే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ మాత్రం సక్సెస్ ట్రాక్ లోకి రాలేకపోతున్నాడు. ‘శ్రీరస్తు శుభమస్తు’ ఒక్కటే శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా. ఆ సినిమా క్రెడిట్ కూడా ఎక్కువగా దర్శకుడు పరశురామ్ ఖాతాలోకి వెళ్లింది.
వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ నటించిన ‘క్షణం’ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. కమర్షియల్ గా ఆడలేదు. దీంతో హిట్ కోసం శిరీష్ మలయాళ రిమేక్ ‘ఏబీసీడీ’ని నమ్ముకొన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అదే టైటిల్ తో రిమేక్ చేశారు. ‘అమెరికన్ బోర్న్ కన్పూజ్డ్ దేశీ’ అన్నది ట్యాగ్ లైన్. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తరు అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ‘ఏబీసీడీ’ ఎలాగుంది ? శిరీష్ కి హిట్ దక్కినట్టేనా.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
అరవింద ప్రసాద్ (అల్లు శిరీష్) అమెరికాలో పుట్టి పెరిగిన ఇండియన్. ఆయన తండ్రి (నాగబాబు) మిలియనీర్. దీంతో ప్రసాద్ కి డబ్బు విలువ తెలియకుండా పోతుంది. కొడుక్కి డబ్బు విలువ తెలియజెప్పాలని తండ్రి చేసిన ప్రయత్నాలేవీ ఫలించవు. దీంతో ప్రసాద్, అతని స్నేహితుడు బాల షణ్ముగం అలియాస్ భాషా (భరత్)ని ఇండియా టూర్‌కి వెళ్లమంటాడు. ఖర్చులకి కేవలం రూ.5000 మాత్రమే ఇస్తాడు. ఆ డబ్బుని రోజుకి రూ. 83 ఖర్చుపెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి. ఇక ఇండియా ‘ఎంబీఏ’ కాలేజీలో చేరిన ప్రసాద్ నేహ(రుక్సర్ థిల్లాన్) పరిచయం అవుతుంది. అది క్రమంగా ప్రేమగా మారుతోంది. ఫైనల్ గా ప్రసాద్ కు డబ్బు విలువ తెలిసిందా.. ? నేహా తో ప్రేమ ఫలించిందా.. ?? అన్నది మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
* ఏబీసీడీ టైటిల్ మాత్రమే
మైనస్ పాయింట్స్ :
* కథ-కథనం
* స్లో నేరేషన్
* కామెడీ, ఎమోషన్.. ఏ ఒక్కటి ఆకట్టుకొనేలా లేదు.
ఎలా ఉందంటే ?
మలయాళ చిత్రం ‘ఏబీసీడీ’ మంచి విజయాన్ని అందుకొంది. ఈ సినిమా రిమేక్ అనేసరికి తెలుగులోనూ మంచి టాక్ అందుకొంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొనేలా ఉండేసరికి.. ఈసారి శిరీష్ మేజిక్ చేయబోతున్నాడు అనుకొన్నారు. కానీ, సినిమాలో ఆ మేజిక్ కనబడలేదు. మాతృకలోని ఫీల్ ని చెడగొట్టాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. 50పైగా కొత్త సీన్లు రాసుకొన్నాడు. అవి గ్రిప్పింగ్ గా లేవు.
మాతృకలోని 15సీన్లు ఉన్నది ఉన్నట్టుగా దించేశారు. అవి ఆకట్టుకోలేదు. ఫలితంగా ‘ఏబీసీడీ’లు కూడా చక్కగా రాయలేని, తీయలేని దర్శకుడుగా సంజీవ్ రెడ్డి నిలిచిపోయారు. ఇక, నటనలోనూ శిరీష్ ఫర్వాలేదనిపించాడు. సినిమాలో కామెడీ పండలేదు. ఎమోషన్స్ లేవు. ఒక్కటంటే ఒక్క సీన్ అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి వీల్లేదు. ఫస్టాఫ్ నుంచి సినిమా సాగదీతగా ఉంది. మధ్యలో కొన్ని సీన్స్ బాగా వచ్చినా.. అప్పటికే నీరసించిపోయిన ప్రేక్షకుడికి అవి ఎక్కవు.
ఎవరెలా చేశారంటే ?
అల్లు శిరీష్ నుంచి అద్భుత నటనకి ప్రేక్షకులు ఆశించలేదు. కాకపోతే.. కాస్త ఎంటర్ టైనర్ చేస్తారని భావించారు. కానీ, అది జరగలేదు. కథ-కథనం సరిగ్గా కుదరనప్పుడు శిరీష్ మాత్రం ఏం చేస్తాడు. రుక్సర్ థిల్లాన్ పాత్రకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఐతే, తెరపై అందంగా కనిపించింది రుక్సర్. మిగితా పాత్రలు కథకి కనెక్ట్ అయ్యేలా సాగలేదు. బాల షణ్ముగం అలియాస్ భాషా (భరత్) మాత్రం అక్కడక్కడ నవ్వులు పంచారు. వెన్నెల కిషోర్ ఉన్నా.. ఆయన నవ్వించలేకపోయారు. మిగితా నటీనటుల గురించి ఎంత మాట్లాడుకొన్నా.. తక్కువే.
సాంకేతికంగా :
టెక్నికల్ గా ఏబీసీడీ గొప్పగా లేదు. జుదా సాందీ అందించిన పాతలు సాదాసీదాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం గొప్పగా ఏమీ లేదు. రాజ్‌తోట సినిమాటోగ్రఫీ కూడా గొప్పగా లేదు. గొప్ప సంభాషణలు లేవు. తొలిభాగమే బోరింగ్ అనుకొంటే.. సెకాంఢాఫ్ ఇంకా బోరింగ్ గా సాగింది. చాలా సన్నివేశాలని కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి.
బాటమ్ లైన్ : ‘ఏబీసీడీ’లు బోర్ కొడతాయ్.. !
రేటింగ్ : 2/5