ఈసీ ముందు విపక్షాల డిమాండ్స్.. ఇవే !

“5 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులను లెక్కించాలి. ఈ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరమేంటి? గత కొన్ని రోజులుగా ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బాధ్యత గల రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేం పోరాడుతున్నాం. ఒక్క రక్త పరీక్షతో శరీరంలో ఉన్న జబ్బు బయటపడదు. మొత్తం స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అలాంటిదే”నన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

21 పార్టీలకు చెందిన విపక్ష పార్టీలు మంగళవారం ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశం సందర్భంగా నేతలు ఎనిమిది పేజీల విజ్ఞాపన పత్రాన్ని సీఈసీకి అందజేశారు. అనంతరం మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయేకే పట్టం కట్టినప్పటికీ గతంలో చాలా సందర్భాల్లో వాటి అంచనాలు తప్పుగా తేలిన విషయాన్ని విపక్ష నేతలు గుర్తుచేశారు.