అరె.. మోడీ ‘చౌకీదార్‌’ని తొలగించారు !


ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ ఖాతాలో తన పేరు ముందు జోడించుకున్న ‘చౌకీదార్‌’ పదాన్ని తొలగించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టిన కొద్ది క్షణాల్లోనే మోడీ ఇలా చేయడం హాట్ టాపిక్ గా మారింది. భాజపా మంత్రులు, నేతలు, మద్దతుదారులు కూడా తమ ట్విటర్ అకౌంట్ల పేర్ల ముందు ‘చౌకీదార్’ అనే పదాన్ని తొలగించాలని ప్రధాని కోరారు.

‘భారత ప్రజలంతా చౌకీదార్లుగా మారి దేశానికి తమ సేవలందించారు. చౌకీదార్ నేడు అతి పెద్ద శక్తిగా అవతరించింది. కుల, మత కలహాలు, అవినీతి, ఆశ్రితవిధానం లాంటి దుష్టశక్తుల నుంచి దేశాన్ని కాపాడే శక్తమంతమైన ఆయుధంగా మారింది’ అంటూ మోడీ ట్వీట్ చేశారు. ఇక చౌకీదార్ స్ఫూర్తిని మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన తరుణం వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తిని దేశ ప్రగతిలో ప్రతి క్షణం సజీవంగా ఉంచుదామని పిలుపునిచ్చారు.