ఓటమిపై చంద్రబాబు ఏమన్నారంటే.. ?

ఏపీలో తెదేపాకు ఘోర పరాజయం తప్పలేదు. ఆ పార్టీ 24స్థానాల్లో మాత్రమే విజయం సాధించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అందిన ట్రెండ్స్ ప్రకారం తెదేపా 15స్థానాల్లో గెలుపొందింది. మరో 9స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెదేపా అధినేత మీడియా ముందుకు వచ్చారు. అందరూ ఊహించినట్టుగా ఆయన ఓటమికి కారణాలని ఈవీఎంలపై మోపలేదు. చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం అందరి బాధ్యత అన్నారు.

వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకూ మనస్ఫూర్తిగా అభినందనలు. పార్టీపై అభిమానంతో ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను సమీక్షించుకుంటాం అన్నారు బాబు. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.