జగన్ కు రెండ్నెళ్ల టైమిచ్చిన జనసేన ?

కేవలం ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకొంటానని ప్రకటించారు వైకాపా అధినేత, కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్. ఐతే, ఆయనకి జనసేన అంత టైం కూడా ఇచ్చేలా లేదు. ఓ రెండు నెలల పాటు వదిలేసి.. ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా ప్రణాఌకలు సిద్ధం చేసుకొన్నట్టు కనబడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు స్పందించారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ నా ఛానెల్ నా ఇష్టం ద్వారా లైన్ లోకి వచ్చారు. ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని నాగబాబు అభినందించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. తమ సహకారం జగన్‌కు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. జనసేన ఓడినా గెలిచినట్టే. ఎందుకంటే.. క్లీన్‌ పాలిటిక్స్‌తో రాజకీయాల్లోకి వచ్చాం. డబ్బులు పంచకుండా ముందుకు రాగలిగాం. జనసేనకు కొన్ని లక్షల ఓట్లు వచ్చాయి. డబ్బుల కోసం ఆశించకుండా కేవలం పవన్‌పై అభిమానం, ప్రేమతో, మంచి మార్పు తెస్తారన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారని అన్నారు. ఓ రెండు నెలలు జనసైనికులు రిలాక్స్ కండీ.. ఆ తర్వాత కార్యచరణ రెడీ చేసుకొని ముందుకు వెళదాం. అధైర్ఘ్య పడొద్దని సూచించారు నాగబాబు.