రాహుల్’కు ఉన్న బాధ్యత చంద్రబాబుకు లేదా.. ?
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. రాజీనామా వద్దని పార్టీ సీనియర్లు ఎంత వారించినా.. వినడం లేదు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఆ పార్టీ నాలుగు నెలల సమయం పెట్టుకొంది. ఇప్పుడు రాహుల్ తీసుకొన్న రాజీనామా విషయం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ కేవలం 23స్థానాలకి మాత్రమే పరిమితం అయింది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలనే డిమాండ్ వినబడుతోంది. ఐతే, ధైర్ఘ్యం చేసి రాజీనామాపై చంద్రబాబుని అడిగే దమ్ము, ధైర్ఘ్యం పార్టీలో ఎవరికి లేదు. రాజీనామా చేసే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా, టీడీఎల్పీనేతగా చంద్రబాబు ఎంపికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీఎల్పీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
శాసనసభాపక్ష నేతగా ఈసారి చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. వాటికి తెరదించుతూ… శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సుజనాచౌదరి, కకనమేడల రవీంద్రకుమార్, కళా వెంకట్రావు, చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.