జగన్ మార్క్.. మొదలు !
ఏపీ సీఎం వైఎస్ జగన్ చాలా స్వీడుమీదున్నాడు. ఆరు నెలల్లోనే మంచి సీఎం అనుపించుకోవాలన్న ఆతృత ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే పనిలో పడిపోయారు జగన్. శాఖలవారీగా సమీక్షా సమావేశాలని నిర్వహించే పనిని మొదలెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై తొలి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తేవాలి. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గుచూపేలా తీర్చిదిద్దాలని జగన్ సూచించారు.
ఇక, శనివారం ఆర్థిక, రెవెన్యూ శాఖలపై జగన్ సమీక్ష చేయనున్నారు. జూన్ 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం నుంచి జలవనరుల శాఖ, జూన్ 4న ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలపై.. అదే రోజు మధ్యాహ్నం గృహనిర్మాణం, జూన్ 6న సీఆర్డీఏపై జగన్ సమీక్షించనున్నారు. జూన్ 8న జగన్ సచివాలయానికి రానున్నారు. అదే రోజు మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. సచివాలయం పక్కనున్న స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.