రివ్యూ : ఫ‌ల‌క్‌నుమా దాస్‌

చిత్రం : ఫ‌ల‌క్‌నుమా దాస్‌ (2019)

నటీనటులు : విశ్వక్‌సేన్‌, సలోనీ మిశ్రా, హర్షితా గౌర్‌, తరుణ్‌ భాస్కర్‌, అభినవ్‌ గోమతం తదితరులు

సంగీతం : వివేక్‌ సాగర్‌

దర్శకత్వం : విశ్వక్‌ సేన్‌

నిర్మాణ సంస్థ : వాన్మయే క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌

విడుదల తేదీ: 31మే, 2019

టాలీవుడ్ లో వాస్తవిక‌త ప్రతిబింబించ‌డం కూడా ఓ ట్రెండ్ అయ్యింది. దాన్ని అనుస‌రించిన చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’. ‘అంగ‌మ‌లై డైరీస్’ అనే ఓ మ‌ల‌యాళ చిత్రానికి రీమేక్ ఇది. దానికి తెలంగాణ నేటివిటీ జోడించే ప్రయత్నం చేశారు. టీజర్, ట్రైలర్ లని చూస్తే అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 తరహా సంచలన విజయాన్ని నమోదు చేసేలా కనిపించింది. మరీ.. ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నిజంగానే ఆ రేంజ్ లో ఉన్నాడా.. ? చూద్దాం పదండీ.. !

కథ :

దాసు (విశ్వక్ సేన్‌) ఫ‌ల‌క్‌నుమాలో ఓ గ్యాంగ్ ని వేసుకుని తిరుగుతుంటాడు. గొడ‌వ‌లూ, కొట్లాట‌లూ అంటూ ప్రతీ రోజూ బిజీనే. త‌న స్నేహితుల‌తో క‌లిసి మ‌ట‌న్ వ్యాపారం మొద‌లెడ‌తాడు. ఐతే అదే వ్యాపారం చేస్తున్న ఇద్దరు రౌడీ బ్రదర్స్‌తో వైరం మొద‌ల‌వుతుంది. అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు దాసు. ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే రూ.25 ల‌క్షలు అవ‌స‌రం అవుతాయి. ఆ డ‌బ్బు సంపాదించ‌డానికి ర‌క‌ర‌కాల మార్గాలు ఎంచుకుంటాడు. అవ‌న్నీ త‌న‌కు కొత్త త‌ల‌నొప్పుల్ని, శ‌త్రువుల్నీ తెచ్చిపెడుతుంది. వాటి నుంచి దాసు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు ? చివ‌రికి ఏమైంద‌న్నదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్

* వాస్తవికత

* ఫస్టాఫ్

* నటీనటులు

మైనస్ పాయింట్స్ 

* కథనం

* నిడివి

* వినోదం

* ఓవర్ డైలాగులు

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

‘ఫ‌ల‌క్‌నుమాదాస్’లో పెద్దగా క‌థ ఉండ‌దు. కానీ, క‌థ‌ని తెలంగాణ నేప‌థ్యానికి చ‌క్కగా అన్వయించుకున్నాడు. ఫ‌ల‌క్‌నుమా గల్లీల్లో జీవిన విధానం, మాట తీరు, దందాలు న‌డిచే ప‌ద్ధతి, కుర్రాళ్ల అల‌వాట్లని బాగా చూపించారు. ప్రతీ స‌న్నివేశంలోనూ మందు, మ‌ట‌నూ క‌నిపిస్తుంటాయి. ఐతే, ఫస్టాప్ పర్వాలేదనిపిస్తుంది. సెకాంఢాఫ్ మాత్రం తేలిపోయింది. ఆర్డరంటూ లేకుండా… ఏవేవో కొన్ని స‌న్నివేశాలు వ‌చ్చి ప‌డిపోతుంటాయి. ద్వితీయార్థంలో సుదీర్ఘంగా సాగే సన్నివేశాలున్నాయి. క్లైమాక్స్‌లో 13 నిమిషాల సుదీర్ఘమైన స‌న్నివేశం ఒకటి ఉంది. తెలంగాణ భాష‌లోని సొగ‌సు, న‌టీన‌టుల ప్రతిభ సినిమాని కొద్దిగా నిలబెట్టాయని చెప్పవచ్చు.

విశ్వక్ సేన్ న‌టుడిగా మెప్పిస్తాడు. త‌న బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ బాగున్నాయి. క‌థానాయిక‌లు ముగ్గురున్నా ఏ ఒక్కరినీ గుర్తు పెట్టుకోలేం. స్నేహితుల బృందం, రౌడీ గ్యాంగ్ ఇలా ఎవ‌రి గురించి చెప్పుకొన్నా పాత్రానుసారం న‌టించారు. చాలా రోజుల త‌ర‌వాత ఉత్తేజ్‌కి మంచి పాత్ర ప‌డింది. దర్శకుడు త‌రుణ్ భాస్కర్‌ నట‌న ఓ స్పెష‌ల్ ప్యాకేజీ లాంటిది. సినిమాలో లెక్కకు మించిన పాత్రలుంటాయి. అవ‌న్నీ ప్రేక్షకుడికి రిజిస్టర్‌ అయ్యే స్థాయిలో లేవు.

సాంకేతికంగా :

నేపథ్య సంగీతం బాగా కుదిరింది. మాటలు బాగున్నాయి. అదే సమయంలో కొన్ని డైలాగ్స్ అతిగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిడివి ఎక్కువగా ఉంది. చాలా సన్నివేశాలకి కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : ఫ‌ల‌క్‌నుమా దాస్‌.. ఊరమాస్ !

రేటింగ్ : 2.75/5

నోట్ : ఈ సమీక్ష.. సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.