జూన్ 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు
శుక్రవారం కేంద్ర కేబినేట్ తొలిసారి సమావేశమైంది. ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్షా సహా 24మంది కేబినెట్ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు పింఛను పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలోని రైతులందరికీ పీఎం కిసాన్ యోజన పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రిటైల్ వ్యాపారులకు పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు పింఛను పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉగ్రదాడులు, నక్సల్స్ దాడుల్లో అమరులైన జవాన్ల పిల్లలకు నెలనెలా భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే ఉపకార వేతనాలని పెంచారు. బాలురకు నెలకు ఇచ్చే రూ.2వేల ఉపకారవేతనాన్ని రూ.2500లకు పెంచారు. అలాగే, బాలికలకు ఇచ్చే రూ.2250ను రూ.3వేలకు పెంచాలని నిర్ణయించారు.
జూన్ 17 నుంచి జులై 26 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 19న లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. జూన్ 20న పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. జులై 4న ఆర్థికసర్వే, జులై 5న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించిచారు.