జగన్ పొదుపు మంత్రం.. దుబారాకు చెక్ !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొదుపు మంత్రం జపిస్తున్నారు. ప్రమాణస్వీకారం రోజు నుంచే దుబారాకు చెక్ పెట్టే పని మొదలెట్టారు. కేవలం రూ. 29లక్షల ఖర్చుతో ప్రమాణస్వీకారోత్సవం పూర్తి చేశారు. 2014లో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ ఖర్చు రూ. కోట్నిన్నర్ కావడం గమనార్హం. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.

“దుబారా ఖర్చులను సిఎం జగన్ గారు కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు”

“వృద్ధాప్య,వితంతు,వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఏపీ దేశంలోనే చరిత్ర సృష్టించింది. కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నావారంతా సిగ్గు పడాలి. నేను చూసాను. నేను ఉన్నాను అంటూ నెలకు పదివేల ఆసరా కల్పించారు యువ ముఖ్యమంత్రి” అంటూ విజయసాయి వరుస ట్విట్ చేశారు.

ఇదిలావుండగా.. సీఎం జగన్ శాఖలవారీగా సమీక్ష సమావేశాలని నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆర్థికశాఖ అధికారులతో జగన్ సమీక్ష చేస్తున్నారు. అత్యవసర ప్రాజెక్టులకు వెంటనే నిధులు మంజారు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అవకతవకలు జరిగాయనే అనుమానాలు ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఆపాలని సీఎం చెప్పినట్టు సమాచారమ్.