టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ?
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కొలువుదీరలేదు. మంత్రివర్గ విస్తరణ చేయాల్సివుంది. ఈ నెల8న మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. అదే రోజు తొలి కేబినేట్ భేటీ ఉండనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కేబినేట్ లో స్థానం దక్కించుకొనే నేతలు ఎవరనేది విస్తృత చర్చసాగుతోంది.
మరోవైపు, ఏపీలో నామినేట్ పదవుల గోల మొదలైంది. దానిపై కూడా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ పదవి వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డికి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. జగన్ తల్లి విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వయంగా అక్కాచెల్లెలు. వైవీ సుబ్బారెడ్డి చెల్లెలునే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివాహమాడారు. దీంతో వైవీ జగన్ కి దగ్గరి చుట్టం.
ఈ నేపథ్యంలోనే ఒంగోలు ఎంపీ టికెట్ దక్కని వైవీ సుబ్బారెడ్డిని ముందుగా సంతృప్తి పరిచాలని సీఎం జగన్ భావిస్తున్నారంట. ఇందులో భాగంగా ఆయనికి రాజ్యసభ టికెట్ లేదంటే టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారమ్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే కొత్త పాలకమండలిని నియమించనుంది.