సీఎంపై అనుచిత పోస్టు హత్య కేసు ఏమీ కాదు : సుప్రీం


సోషల్‌మీడియాలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత పోస్టు చేసిన వ్యవహారంలో ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ప్రశాంత్‌ కనోజియాను పోలీసులు అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇదేమీ హత్య కేసు కాదని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

‘వ్యక్తికి స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇలాంటి కేసులను మేం విచారించం కానీ సోషల్‌మీడియా పోస్టుల కారణంగా ఓ వ్యక్తి 11 రోజులు జైల్లో ఉండటం సరికాదు. అందుకే ఈ పిటిషన్‌ను విచారించాం’ అని కోర్టు అభిప్రాయ పడింది. అదే సమయంలో.. ప్రశాంత్‌కు బెయిల్‌ ఇవ్వడం అంటే ఆయన చేసిన పోస్టులను న్యాయస్థానం సమర్దించినట్లు కాదని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ఇంతకీ ప్రశాంత్‌ కనోజియా ఏం చేశాడంటే.. ? ఆయన ఇటీవల తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో ఓ వీడియో పోస్టు చేశారు. సీఎం ఆఫీస్‌ ఎదుట ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తాను పెళ్లి ప్రతిపాదన పంపానని చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. తాజా కోర్టు తీర్పుతో ప్రశాంత్ బెయిల్ పై విడుదల కానున్నాడు.