బ్రేకింగ్ : వరల్డ్ కప్ నుంచి శిఖర్ ధావన్ అవుట్

వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి తప్పుకోనున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం అతడి ఎడమచేతి బొటన వేలుకు మంగళవారం స్కానింగ్‌ చేయించింది. దీంతో మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అతడి స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌పంత్‌కు చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది.

టీమిండియా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 117పరుగులు చేసి.. మంచి టచ్ లోకి వచ్చాడు. దీంతో టీమిండియాకు ఇక ఎదురే లేదు. ఓపెనర్లు ధావన్, రోహిట్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ, నెం.4కు కెల్ రాహుల్ సెట్టైపోయాడు. లోయర్ ఆర్డర్ లో హార్థిక్ పాండ్యా, ధోని ఉన్నారని అనుకొన్నారు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కౌల్టర్‌నైల్‌ విసిరిన బంతి గబ్బర్‌ చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడినా 109 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే నొప్పి వల్ల ఆసీస్‌ మ్యాచ్‌లో గబ్బర్‌ ఫీల్డింగ్‌ చేయలేదు. అతడి స్థానంలో 50 ఓవర్లు రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ చేశాడు. ఇదిలా ఉండగా టీమిండియా గురువారం న్యూజిలాండ్‌తో తలపడనుంది.