మంత్రులకి జగన్ తొలి వార్నింగ్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులకు తొలివార్నింగ్ ఇచ్చారు. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సోమవారం తొలిసారి సమావేశమైంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌ మంత్రులకి కొన్ని సూచనలు, హెచ్చరికలు చేశారు.

‘అవినీతి రహిత పాలనే లక్ష్యం. అవినీతి మరక అంటితే మందలింపులుండవ్‌. అలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించడమే. రెండున్నరేళ్లపాటు పదవికి గ్యారెంటీ ఉండదు’ అని సున్నితంగా హెచ్చరించారు సీఎం జగన్. అవినీతికి దూరంగా ఉండాలని సూచించిన సీఎం.. గత ప్రభుత్వంలో శాఖల వారీగా జరిగిన అవినీతిని ఇప్పుడు ఆ శాఖల మంత్రులు వెలికితీయాలి. ఏయే శాఖలో అవినీతి జరిగిందో ఆ వివరాలను వెబ్‌సైట్లో ప్రజల ముందుంచుదామని అన్నట్టు తెలిసింది.

మంత్రులకి సీఎం జగన్ మరో ముఖ్యమైన సూచన కూడా చేశారు. మంత్రులు ఎక్కడ సొంతగా హామీలు ఇవ్వకూడదు. హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే.. మంత్రులకి చెడ్డ పేరు వస్తోంది. ఆ ఎఫెక్ట్ ప్రభుత్వంపై ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలతో మమేకం కావాలి. కొత్త తరహాలో ఆలోచించి వినూత్నంగా శాఖలను నడిపించాలని మంత్రులకి సూచనలు చేశారు సీఎం జగన్.