కంగారూ పడినా.. ఆసీస్‌ దే విజయం !

భారీ స్కోర్ సాధించేలా కనిపించిన ఆసీస్ ని 307 పరుగులకే కట్టడి చేసింది పాకిస్థాన్ జట్టు. 34 ఓవర్లకు ఆసీస్ 223/2తో నిలిపింది. ఆ జోరు చూస్తే 370కి పైగా స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. ఇంతలో పాక్ అద్భుతం చేసింది. కేవలం 84 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు తీసింది. మరో ఓవర్‌ ఉండగానే కంగారూలను 307కు ఆలౌట్‌ చేసింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 308పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్‌ 45.4ఓవర్లలోనే 266 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌(53) అర్దసెంచరీతో రాణించగా.. హఫీజ్‌(46), సారథి సర్ఫరాజ్‌(40)లు ఫర్వాలేదనిపించారు. పాక్ ఇన్నింగ్స్ లో హసన్‌ అలీ(32; 15బంతుల్లో 3×4, 3×6), వాహాబ్‌(45; 39బంతుల్లో 2×4, 3×6) ఆటనే హైలైట్. వీరిద్దరూ కలిసి పాక్‌ను విజయం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే స్టార్క్‌ ఓకే ఓవర్‌లో వాహాబ్‌, ఆమిర్‌ను ఔట్‌ చేసి పాక్‌పై ఒత్తిడి పెంచాడు. 46ఓవర్‌లో సర్ఫరాజ్‌ కూడా మ్యాక్స్‌వెల్‌ అద్భుత త్రోకి రనౌట్‌ కావడంతో పాక్‌ 45.4 ఓవర్లకే చాపచుట్టేసింది.