తెరాసకు మరో ఆప్షన్ లేదు
గతంలో ఎన్డీయే ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తెరాస తటస్థ వైఖరిని అవలంబించింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాల్లో మద్దతు తెలిపినా ముస్లిం రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కేంద్రం సాచివేత వైఖరిని నిరసించింది. ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఈసారి కేంద్ర ప్రభుత్వంతో తెరాస వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఐతే, ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వంతో తటస్థంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు జరగనున్న తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకి కేంద్రంలో అనుసరించాల్సిన వైఖరిపై క్లారిటీ ఇవ్వనున్నారు.
పార్లమెంటు సమావేశాల్లో తెరాస ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేయనున్నారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు కొనసాగనున్నారు. ఇక లోక్‌సభ పక్ష నేతగా కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్) వినిపిస్తోంది. కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం), రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), నేతకాని వెంకటేశ్ (పెద్దపల్లి) తదితర పేర్లు పరిశీలనలో ఉన్నా.. కొత్త ప్రభాకర్‌రెడ్డి కే ఎక్కువగా అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనికి మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. ఇక, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెరాస 9ఎంపీ స్థానాలని గెలుచుకొన్న సంగతి తెలిసిందే.