రోజా తృప్తిపడినట్టేనా ?


మంత్రి పదవి రాకపోవడంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆమె మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో రోజాలో అసంతృప్తి నిజమేనని అర్థమయింది. రోజా కంటే ఆమె అభిమానులు బాగా డిస్సపాయింట్ అయ్యారు. ఎన్నికల ఫలితాల రాకముందు నుంచి ఏపీలో వైకాపా అధికారంలో వస్తే రోజాకు మంత్రి పదవి ఖాయం అనే ప్రచారం జరిగింది. రోజాకు హోంశాఖ అప్పగిస్తారని చెప్పుకొన్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పుట్టుకొచ్చాయి. ఐతే, కొన్ని కారణాల వలన రోజాకి మంత్రి పదవి దక్కలేదు. దీంతో అసంతృప్తిలో ఉన్న రోజాని సీఎం జగన్ తృప్తిపరిచారు. ఆమెకు కీలక పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా నియమించారు. తనపై నమ్మకముంచి ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించిన సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. ఐతే, రోజా టార్గెట్ మాత్రం మంత్రి పదవే. దానికోసం మరో రెండున్నరేళ్లు ఆగాల్సిందే. అప్పుడు కూడా గ్యారెంటీ లేదన్నది వైకాపా శ్రేణుల మాట.