ప్రత్యేక హోదా కావాలని అడిగా : జగన్
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి లేదు. రిక్వెస్ట్ మాత్రమే చేయాలి. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్ది కూడా అదే చేశారు. శుక్రవారం ఢిల్లీలో భాజాపా అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ బేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అంశాలను షాకు వివరించినట్టు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలుపుతూ ఓ లేఖను అమిత్‌షాకు అందజేశా. ప్రధాని నరేంద్ర మోదీ మనసు కరిగించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని కోరానని తెలిపారు.
సీఎం జగన్ ఈ రోజు రాత్రి జన్‌పథ్ రోడ్డులోని నివాసంలో బస చేయనున్నారు. శనివారం జరగబోయే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సమావేశంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించబోతున్నారు. అంతకంటే ముందు వైకాపా పార్లమెటరీ పార్టీ భేటీ జరగనుంది. ఇందులో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, వైకాపాకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపాదన విషయంపై సీఎం జగన్ స్పందించారు. అలాంటిది ఏమీ రాలేదని, అలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.